వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. అంతేకాదు ఎప్పటినుంచో జిల్లా పర్యటనలు, సమావేశాలతో తమ క్యాడర్ కి దగ్గరవుతున్నారు. అయితే.. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో మాత్రమే అభ్యర్ధులను ఖరారు చేసిన బాబు.. చాలా నియోజకవర్గాలలో కనీసం ఇంచార్జ్ లు కూడా నియమించలేదు. ఇదే ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని నియోజకవర్గాలలో సీటు నాదంటే నాదంటూ తమ్ముళ్ళు తన్నుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. నిడదవోలులో సీటు కోసం టీడీపీ నేతల మధ్య గట్టి పోటీ ఉందని అంటున్నారు. బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ నిడదవోలు సీటు కోసం కుస్తీ పడుతున్నారని లోకల్ టాక్. ఢీ అంటే ఢీ అన్నట్టుగా వీరిద్దరూ.. నియోజకవర్గంలో ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారట. 2009 2014ల్లో టీడీపీ తరఫున బూరుగుపల్లి శేషారావు గెలుపొందారు. అయితే ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బూరుగుపల్లి శేషారావు మాత్రం సీటు తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో శేషారావు ఓటమికి కారణం జనసేననే అని అంటున్నారట. ఎందుకంటే గత ఎన్నికలో టిడిపి జనసేన సింగిల్ గా పోటీ చేశారు. జనసేన అభ్యర్థి బరిలో ఉండి 23 వేలకు పైగా ఓట్లు సాధించడం వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని శేషారావు తన అనుచరులతో చెప్తూ ఉంటారట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు ఉంటే.. నిడదవోలులో తానే గెలస్తున్నాని బూరుగుపల్లి శేషారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. మధ్యలో కుందుల సత్యనారాయణ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన పదేపదే చంద్రబాబు , లోకేష్ లను కలిసి తన సీటు విషయమై ప్రస్తావన తెస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే.. ఓట్లు చీలిపోవడం ఖాయం మళ్ళీ టిడిపి ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ బహిరంగ సవాల్ చేశారు. ఒకవేళ పొత్తులు ఉంటే నిడదవోలు లో మాంచి టఫ్ ఫైట్ నడుస్తోందన్నమాట. చూడాలి మరి చివరకు ఎం జరుగుతుందో అనేది.