ప్రస్తుతం విశాఖ పాలనా రాజధానిపై సిఎం జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టిడిపికి కంచు కోటగా ఉన్న విశాఖను ఈసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సిఎం జగన్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లోనూ విశాఖ ఉత్తరం టిడిపి కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం సాగుతోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో బెర్త్ కోసం అటు టిడిపి, అటు జనసేన.. మరోవైపు అధికార పార్టీ, బీజేపీ సైతం కర్చీఫ్ వీసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు.. రెండోసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ప్రతి ఎన్నికల్లో.. కొత్త వారికే అవకాశం ఇస్తూ వస్తున్నారు.. ఇక్కడి ఓటర్లు. అందుకు తగ్గట్టుగానే అభ్యర్ధులను మారుస్తూ వస్తున్నారు.. పార్టీ అధినాయకులు. ఏ పార్టీ కూడా ఇక్కడ.. వరుసగా రెండు సార్లు గెలుపు జెండా ఎగరేయలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గంటా శ్రీనివాసరావు గెలుపొందినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటివరకు గంటా తన నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే గంటా మరోసారి విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారా లేదా..? అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ.. పోటీ చేసిన చోట మళ్లీ పోటీ చేయకుండా.. ఓటమెరుగని నేతగా.. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఉండే నాయకుడిగా.. గంటా శ్రీనివాసరావుకు పేరుంది.
ఆ మధ్య స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో.. రాజీనామాతో హడావుడి చేశారు గంటా శ్రీనివాసరావు. అధిష్టానంతో ఉన్న గ్యాప్ కారణంగా.. పార్టీలోనూ ఆయన ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరిగింది. అలా అని వైసీపీకి దగ్గరవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ ఆయి నియోజగవర్గంలో తన పని తాను చేసుకుపోతూ మరింత స్పీడు పెంచారు. ఈసారి.. ఆయన చోడవరం, భీమిలి, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల్లో.. ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసేందుకు పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో.. టీడీపీ నుంచి ఊర్మిళ గజపతిరాజు టికెట్ ఆశిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నీ వర్కవుట్ అయితే.. ఊర్మిళే.. పోటీకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తు ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలతో పొత్తుకు దూరంగానే ఉంటుందని చర్చ నడుస్తోంది. దానిని బట్టి చూస్తే ఓట్లు చీలడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ నేత కేకే రాజు.. విశాఖ నార్త్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకుంటూ.. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ త్రిముఖ పోరులో వైసీపీనే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈసారి విశాఖ నార్త్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో అనేది.