కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ రైతు భరోసా కార్యక్రమంలో దర్శనమిచ్చిన ఈ కలెక్టర్ సృజన జీవితం గురించి తెలిస్తే.. నివ్వెరపోతారు. కర్నూలుకు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం వెనక ఎంతో కృషి దాగి ఉంది. కర్నూలు జిల్లా ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు ఇక్కడ మగవారే కలెక్టర్లగా నియమితులవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 54 మంది కర్నూలులో పని చేయగా.. అందరూ పురుషులే. అసలు ఈమె జీవితంలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే.. 2007లో హెచ్సీయూలో ఎంఏ పూర్తిచేయగానే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించి వరుసగా మూడేళ్లు పరీక్ష రాశారు. ఈ మూడుసార్లూ విఫలమయ్యారు. ఈ మధ్యలో గ్రూప్-1 రాయడం, లే సెక్రటరీగా ఎంపిక కావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే సివిల్స్ చివరి ప్రయత్నంలో 44వ ర్యాంకు సాధించడానికి తోడ్పడింది.2008, 2009లో పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఆప్షన్స్తో హాజరయ్యారు. కానీ విజయం లభించలేదు. దీంతో లోపం ఎక్కడ అని అన్వేషించారు. ఆప్షనల్స్ సిలబస్ విషయంలో సమయం ప్రధాన సమస్యగా గుర్తించారు. అకడెమిక్స్ వేరు.. కాంపిటీటివ్ అందులోనూ యూపీఎస్సీ సివిల్స్ వేరు అని తెలుసుకున్నారు. లోపాలు, పొరపాట్లు అన్నీ తెలిశాయి. కానీ ఉన్నది ఒకే ఛాన్స్. వెంటనే రాస్తే.. పూర్వ అనుభవం ఎదురవుతుందనే భయం నెలకొంది. దీంతో రెండేళ్లు గ్యాప్ ఇచ్చారు. నాలుగోసారి సైకాలజీ బదులు ఫిలాసఫీతో హాజరయ్యారు. పొలిటికల్ సైన్స్ నా కోర్ సబ్జెక్టు కావడంతో దాన్ని మరో ఆప్షనల్గా తీసుకున్నారు.
విశాఖ మహా నగరపాలక సంస్థ కమిషనర్గా విధులు నిర్వహించే సమయంలో సృజన మంచి పేరు సంపాదించుకున్నారు. మొదటి వేవ్ కరోనా సమయ౦లో.. అంటే 2020 ఏప్రిల్ లో ఆమె పండంటి బిడ్డకు జన్మనించి నెల రోజులే అయ్యింది. ఆ సమయంలో కరోనా నియంత్రణలో భాగంగా విశాఖపట్నం లాంటి మహానగరంలో మున్సిపల్ కమిషనర్ అవసరం ఎంతమేర ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణకు తన అవసరం ఎంత ఉందో తెలిసిన సృజన.. వెంటనే విధుల్లో చేరారు. బిడ్డను భర్త, తల్లికి అప్పజెప్పి తన విధులకు హాజరయ్యారు. కేవలం ఆఫీస్కే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కీలక పాత్ర పోషించి, మంచి ఆఫీసర్గా ఖ్యాతి సంపాదించుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసిన అనంతరం 2021 అక్టోబర్లో పరిశ్రమలశాఖ డైరెక్టర్గా గుమ్మళ్ల సృజన బదిలీపై వెళ్లారు. కర్నూలు జిల్లాకు కలెక్టర్గా 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గుమ్మళ్ల సృజన నియమితులయ్యారు. కర్నూలు జిల్లాకు కలెక్టర్గా ఈమె మొదటి మహిళగా నియమితులయ్యారు.