జనసేన పార్టీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. సిఎం జగన్ ను పొగడటంలో వైసీపీ నేతలను మించిపోయారు. ప్రస్తుతం ఆయన పనికి అంతా ఔరా అంటున్నారు. ఇంతకీ ఆయన ఎం చేశారంటే.. రాపాక వరప్రసాదరావు కుమారుడి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పత్రికపై ఏపీ సీఎం జగన్ , భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో..’ అంటూ అచ్చు వేయించారు. జనసేన ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి శుభలేఖపై వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ ఫోటోను ముద్రించడం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఈ శుభలేఖను షేర్ చేస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఇతర నాయకులందరూ ఓటమి పాలైన వేళ.. రాపాక గెలుపు సంచలనంగా మారింది. రాజోలు నుంచి ఎన్నికైన రాపాక.. గెలిచిన తొలినాళ్లలో అధికార పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పారు. జనసేనలో ఉంటే తానే నంబర్ 1 అని, అదే వైఎస్సార్సీపీలోకి వెళ్తే.. తన నంబర్ 152 అవుతుందని తనదైన శైలిలో చెప్పి నవ్వులు పూయించారు. దీంతో జనసైనికులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయినప్పటికీ… ఎమ్మెల్యే రాపాక సిఎం జగన కే తన మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. మరి ఎమ్మెల్యే రాపాక కుమారుడి వివాహానికి సిఎం జగన్ హాజరు అవుతారో లేదో అన్నది చూడాలి.