రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ విచారణకు హాజరయ్యారు. అంతకముందు.. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు సీబీఐ రెండు అభియోగపత్రాలు దాఖలు చేసిందని, తాను నేరం చేసినట్లు అందులో ఎలాంటి ఆధారాలు చూపలేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు.
వివేకా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి ముప్పు పెరుగుతోందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో జరగకూడనివి ఏవైనా జరిగితే కేసును పక్కదోవ పట్టించే అవకాశముందని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి సీఎం జగన్ స్పందించి వీరికి అదనపు భద్రత కల్పించాలని విష్ణు కోరారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.