మేకపాటి ఫ్యామిలీకి రాజకీయ౦గా నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది. ప్రస్తుతం ఈ కీలకమైన కుటుంబంలో చిచ్చు రేగింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని వైసీపీ సస్పెండ్ చేయడంతో అసలైన రాజకీయం మొదలయ్యింది. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు మేకపాటిపై నిరసనకు దిగారు. ఆయన ఉదయగిరి నియోజకవర్గానికి ఎలా వస్తారో తామూ చూస్తామంటూ.. వైసీపీ శ్రేణులు సైతం గట్టిపట్టే పట్టారు. ఈ క్రమంలోనే చంద్రశేఖరరెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు పార్టీకి సంబంధం లేదని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని అన్నారు.
అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మేకపాటి రాజమోహన్రెడ్డి రెండో కుమారుడు.. ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమకు తమ బాబాయికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఆయనకు అర్ధమయ్యే రోజు ఒకటి వస్తుందని వెల్లడించారు. తన బాబాయి మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యవహారం తమకు నచ్చలేదన్నారు. పార్టీని ధిక్కరించడం.. పార్టీ గీసిన గీత దాటడం సరికాదన్నారు. రెండు సార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చిందని.. ఈ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోయారని చెప్పారు. అయితే తాము మాత్రం వైసీపీ వెంటే ఉంటామని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా నెల్లూరులోని 10 నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన తమను అక్కున చేర్చుకున్నది వైసీపీనేనని అన్నారు.ఇప్పుడు తాము ఇంతటి హోదాలో ఉన్నామంటే అది వైసీపీ వల్లేనని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై ఆసుపత్రికి తరలించారు.