వివేకా కేసులో ట్విస్ట్ సుప్రీంకోర్టు సీరియస్

వైఎస్ వివేకా హత్య జరిగి నాలుగేళ్ళు గడుస్తున్నా.. ఏఎ కేసులో అసలు నిందితులు ఎవరో అన్నది ఇప్పటి వరకు ఒక నిర్ధారణకు రాలేదు. ఏఎ కేసులో ఆయా వ్యక్తులకు కేవలం నోటీసులు ఇవ్వడం, విచారణ చేపట్టడం ఇలా కాలయాపన జరుగుతోంది. ఇక ఈ కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని, అసలు ఈ కేసు విచారణ ఎక్కడ ఆలస్యం అవుతుందని.. సీబీఐని ప్రశ్నించింది. విచారణ త్వరగా ముగించకపోతేవేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సిబిఐ డైరక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్ ను సుప్రీం ఆదేశించింది. ఇలా ఈ కేసును ఇంకెంతకాలం సాగతీస్తారని న్యాయస్థానం మండిపడింది. సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున ఆయన్ను మార్చాలని పిటిషన్ లో కోరింది. అయితే దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కోర్టుకు సీబీఐ తరుపు న్యాయవాది తెలిపారు. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఇక ఇదే కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. హత్య కేసు లో ఏ-4 దస్తగిరినీ అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈ పిటీషన్ ను భాస్కర రెడ్డి కోర్టులో వేసారు. ఇప్పటికే భాస్కర రెడ్డిని విచారణకు రమ్మంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. గత వారం నోటీసుల మేరకు కడప లో భాస్కర రెడ్డి హాజరు కాగా..సీబీఐ అధికారులు అందుబాటులో లేరు. దీంతో..మరోసారి నోటీసులు ఇస్తామని సీబీఐ చెప్పింది. ఇప్పుడు ఈ విచారణ సమయంలో భాస్కర రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.