వచ్చే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. తమకు ఉన్న అన్ని అవకాశాలను అస్త్రంగా మలచుకోవాలని బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు లేదా మూడు సార్లు ఓటమి పాలయిన సీనియర్లకు నో టికెట్ అంటూనే.. యువతకు 50 శాతం అవకాశం కల్పిస్తానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే యువత పార్టీపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అలానే కొందరు సీనియర్లను కూడా తప్పించే పనిలో బాబు నిమాగ్నమయ్యారు. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఓటమి చవి చూసిన సీనియర్లలో ఇప్పటికే కొందర్ని పక్కన పెట్టింది పార్టీ అధిష్టానం. ఇక్కడే అసలైన సమస్య నెలకొంది. పార్టీలో ఇంతకాలం కష్టపడి పనిచేస్తే మమ్మల్ని పక్కన పెట్టి కొత్త వారికి టిక్కెట్లు ఇస్తారా అంటూ.. సీనియర్లు బాబును ప్రశ్నిస్తున్నారట. ఇక ఈ నేపధ్యంలోనే.. పార్టీని విజయ పధంలో నడిపించడానికి లోకేష్ కూడా తన కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.
లోకేష్ చేస్తున్న పాదయాత్రలో కొన్ని సంచలన నిజాలు ఒక్కొకటిగా ఆయన చెవిన పడుతున్నాయట. యువగళం పాదయాత్ర ముగిసిన తర్వాత.. సాయంత్రం వేళ పార్టీ పరిస్థితిపై లోకేష్ చర్చిస్తున్నారట. క్కడ బస చేసినా.. ఆ నియోజకవర్గం.. మండలం.. స్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంజరుగు తోంది? అన్న దానిపై లోకేష్ ఆరా తీస్తున్నారట. ఈ క్రమంలో సొంత పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు.. నాయకుల అసంతృప్తి వంటివి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయట. వీటికి సమాధానం చెప్పలేక నారా లోకేష్ తలపట్టుకుంటున్నారట. తమ పార్టీలో కూడా అసంతృప్తులు అంతకంతకూ పెరిగిపోతున్నారట. మరోవైపు.. కొందరు సీనియర్ నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని తమకు అనుకూలంగా లేకపోతే.. అంతా బాగుందనే విధంగా వివరిస్తున్నారట. ఇది కూడా పార్టీలో చర్చకు దారితీసింది. మొత్తానికి పార్టీలో కొందరు చేస్తున్న పనికి మెజారిటీ నాయకులు కుమిలిపోతున్నారనేది వాస్తవం అంటున్నారు.