ఏపీ రాజకీయాల్లో ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి రాజకీయ ఎంట్రీ అంటూ.. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె కుటుంబ వ్యవహారాలతో పాటు వ్యాపారాలను చూసుకుంటున్నారు. వాటిని విజయవంతంగానే నడుపుతున్నారు. ఆ రెండు బాధ్యతలకే పరిమితమైన ఆమె.. వచ్చే ఎన్నికల ద్వారా రాజకీయ ఎంట్రీకి సిద్ధమయ్యారు అనే వార్త రాజకీయాల్లో వైరల్ అవుతోంది.
నిజంగానే వైఎస్ భారతి రాజకీయాల్లోకి వస్తున్నారా..? లేక ఇదంతా ఒట్టి ప్రచారమేనా..? అసలు ఆ ప్రచారంలో నిజమెంత..? వచ్చే ఎన్నికలలో కడప జిల్లా నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ను సీఏం జగన్ ఇక్కడే నెలకొల్పారు. గతంలో ఇక్కడి నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన అభ్యర్ధులు గెలిచినా మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.ముందు జాగ్రత్తగా భారతిని ఎమ్మెల్యేను చేయడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పదికి పది స్థానాల్లో ఫ్యాన్ గాలి వీచింది. అయితే మరోసారి క్లీన్ స్వీప్ చేయడం అంత ఈజీ కాదనే నివేదికలు అందినట్టు సమాచారం. ముఖ్యంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం జమ్మలమడుగులో యాక్టివ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన బీజేపీ గూటికి వెళ్లారు. కానీ మళ్లీ ఆయన టీడీపీలోకి వచ్చి.. జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మరొకసారి కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని సిఎం జగన్ భావిస్తున్నారట. అలా జరగాలంటే.. బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించాలి. అందుకోసం సిఎం జగన్ వైఎస్ భారతిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట. ఈ విధంగా గత రెండ్రోజుల నుంచి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై సిఎం జగన్ ఏమని స్పందిస్తారో చూడాలి.